శబ్దం చేసిన ఆనంద తాండవం

శబ్దం అంటే… ధ్వని మాత్రమే కాదు. అంతరంగాన్ని కదిలించే అద్భుత సాధనం. శబ్దం అంటే.. ఉచ్చారణ విధానం మాత్రమే కాదు.. శ్వాస నియంత్రణ ద్వారా యోగసాధన చేయించే మార్గం. శబ్దం అనంతశక్తికి నిలయం. విశ్వ ప్రతిస్పందనకు కేంద్రం. సమస్త వాఙ్మయ ఆవిర్భావానికి శబ్దమే మూలాధారం. అందుకే శబ్దం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అనంతమైన శబ్దశక్తితో శివుడినే కదిలించింది ‘శివతాండవ స్తోత్రం’.
రాక్షస వంశంలో పుట్టినప్పటికీ అఖండమైన శివభక్తిని తనువులోని ప్రతి అణువులో నింపుకొన్నాడు రావణాసురుడు. ఇష్టదైవం పరమేశ్వరుడిని దర్శించుకోవాలనే సంకల్పంతో ఓ రోజు కైలాసానికి చేరుకున్నాడు. ఎంతసేపు నిరీక్షించినా శివుడు కరుణించలేదు. మొత్తంగా కైలాసపర్వతాన్నే పెకలిస్తానంటూ ఆవేశంతో ఊగిపోయాడు. అనుకున్నదే తడవుగా తన ఇరవై చేతులతో కైలాసపర్వతాన్ని పెళ్లగించటం ప్రారంభించాడు. విశ్వమంతా చేష్టలుడిగి చూసింది. పరమేశ్వరి కూడా విస్తుపోయింది. శివుడు మాత్రం ఏమీ పట్టనట్టు ఆనంద తాండవం చేస్తున్నాడు.

రావణుడు గాఢమైన మూఢభక్తితో కైలాసాన్ని పెకలిస్తూనే.. ఆర్తితో తన ప్రాణదైవం శివుణ్ని అనేక విధాలుగా స్తోత్రం చేయసాగాడు. రాక్షసుడి నోటి నుంచి అద్భుతమైన స్తోత్రం ఆవిర్భవించింది. ‘ఏమిటా అద్భుత వర్ణన… ఏమిటా శబ్ద సౌందర్యం. ఏమిటా ఉపమాన విన్యాసం… అద్భుతం రావణా! భక్తుడవంటే నీవేనయ్యా’ అంటూ సృష్టి అంతా ముక్తకంఠంతో ప్రశంసించింది. దశకంఠకృత శివతాండవ స్తోత్రంగా విశ్వవిఖ్యాతి పొంది నేటికీ శివభక్తుల పాలిట కల్పవృక్షంగా ప్రకాశిస్తున్నది ఆ స్తోత్రరాజం. ‘అమంత్రం అక్షరం నాస్తి’- మంత్రం కాని అక్షరం లేదంటారు పెద్దలు. బీజాక్షరాల్లోని మంత్రశక్తి ఈ స్తోత్రంలో అంతర్లీనంగా సాగుతుంది. అందుకే శివతాండవ స్తోత్రాన్ని కేవలం స్తోత్రంగా కాకుండా మోక్షానికి దోవ చూపించే యోగసాధన విధానంగా గ్రహించాలి.శబ్ద ఝరి… భావనా లహరి
శివతాండవ స్తోత్రంలోని తొలి శ్లోకమే పరమేశ్వరుడి నాదతత్త్వాన్ని ప్రకటించటంతో ప్రారంభమవుతుంది. ‘డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం’… డమ డమ డమ అంటూ మోగే స్వామి డమరుక శబ్దంలోని వైవిధ్యం, ఆ శబ్ద వైభవం, అందుకోసం రావణుడు ఉపయోగించిన శబ్దవైచిత్రి మన మనసుల్ని ఊయలలూగిస్తాయి.

ధగద్ధగద్ధగజ్జ్వల్లలాటపట్టపావకే, స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదాంధకచ్ఛిదం, స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం- శివతాండవ స్తోత్రంలో ఇటువంటి అద్భుతమైన పదప్రయోగాలు, విశేషణాలకు కొదవ లేదు. ఒకే పదాన్ని విభిన్న అర్థాల్లో, విభిన్న పదాల్ని ఒకే అర్థంలో ప్రయోగిస్తూ అంత్యప్రాసతో సాగిన తాండవ స్తోత్రం మన మనసుల్ని నిజంగానే ఆనంద తాండవం చేయిస్తుంది.

‘మకరందం పిబన్‌ భృంగో గంధాన్నాపేక్షతే యథా/ నాదాసక్తం సదా చిత్తం విషయం నాహికాంక్షతి’ – పువ్వు నుంచి మకరందాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెద మకరందం మత్తులో లీనమై పువ్వు రంగేమిటో కనీసం పట్టించుకోనట్లుగా శబ్దంలో లీనమైన చిత్తం ఇంద్రియ సుఖాలను కోరదు. అది తన చంచలత్వాన్ని విడిచిపెట్టి నాదమనే సుగంధం చేత మత్తెక్కినదవుతుంది’ అని నాదబిందూపనిషత్‌ చెబుతుంది. శివతాండవ స్తోత్రం సరిగ్గా ఇలాంటి అనుభూతినే కలిగిస్తుంది.

మన శరీరంలోని షట్చక్రాలకు శబ్దమే మూలం. మన రెండు చెవులనూ మూసుకుని శ్రద్ధగా ఆలకిస్తే లోపలి నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. వాటిని అనాహత ధ్వనులు అంటారు. అనాహత చక్రం నుంచి అవి ఉత్పన్నమవుతాయి. అంటే మానవ శరీరం పూర్తిగా శబ్ద (నాద) మయమని అర్థం చేసుకోవాలి. నాదమయమైన తనువుతో నాదస్వరూపుడైన పరమేశ్వరుడిని అర్చించాలి. అదే మోక్షసాధన.

ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా సృష్టి అంతా శక్తి ప్రకంపనల సమూహమని స్పష్టంగా చెబుతున్నది. ఎక్కడైతే ప్రకంపన ఉంటుందో, అక్కడ శబ్దం ఉంటుంది. యోగాలో ఈ సృష్టి అంతా శబ్దమే అనీ, దీన్ని నాదబ్రహ్మ అని అంటాం. ఈ సృష్టి అంతా సంక్లిష్టమైన శబ్ద అమరికలే. ఈ సంక్లిష్టమైన అమరికల్లో, కొన్ని శబ్దాలను మూల శబ్దాలుగా గుర్తించారు. వీటినే బీజాక్షరాలు అంటారు. ఇటువంటి అనేక బీజాక్షరాల సమాహారంగా సాగుతుంది శివతాండవ స్తోత్రం.

స్వామి చిదగ్ని స్వరూపుడు. మూడోకన్ను అందించే సందేశం ఇదే. లౌకిక దృష్టికి అందని జ్ఞానాన్ని మూడోనేత్రంతో అందుకోవాలి. పరమశివుడి మూడోకన్ను ప్రళయానికి, విధ్వంసానికే కాదు… జ్ఞానోదయానికి, చైతన్యానికి సూచిక. ఇది ప్రాపంచిక వాంఛలను దూరం చేసే సాధనం. శివయ్య మూడో నేత్రం తెరిస్తే భస్మమే అంటారు. పాపం భస్మమైతే మిగిలేది జ్ఞానమే. అటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపుడైన స్వామి దృష్టి మన మీద నిరంతరం ప్రసాదించమని వేడుకోవాలి. అందుకోసం ఆరాటపడాలని చెబుతుందీ స్తోత్రం.

శివుడి రూపం, చేష్టలు ఎంతో చిత్రవిచిత్రంగా ఉంటాయి. అడగ్గానే హాలాహలాన్ని మింగి గరళకంఠుడయ్యాడు. స్వర్గం నుంచి ఉరుకు పరుగు వేగంతో వచ్చే గంగమ్మను ఆపడానికి తన శిరస్సును అడ్డుపెట్టాడు. మరే వస్త్రమూ లేనట్టు గజచర్మాన్ని కప్పుకొన్నాడు. తల మీద చంద్రవంక. ఆ కిందుగా నల్లటి కంఠసీమ. ఆ కింద ఎర్రటి జీరతో ఉండే పులిచర్మం. ఇంతటి భిన్నత్వాన్ని ధరిస్తూ సకల విశ్వాన్ని ఏకత్వభావనతో చూసే పరమేశ్వరుడు ప్రపంచానికి శ్రేయస్సును కలిగించాలని కోరుతుందీ స్తోత్రం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles