నవ అవతార మూర్తి

‘న రావణం సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్‌
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః’
‘వేయిమంది రావణులైనా యుద్ధంలో నాముందు నిలువలేరు. శిలలతో, వృక్షాలతో సకల రాక్షసులను, లంకాపురినీ ధ్వంసం చేస్తాను’ ఇదీ హనుమ జయధ్వానం. లంకాపురిలో సీతమ్మ జాడ తెలుసుకున్న తర్వాత ప్రాసాదం అధిరోహించి ఆంజనేయుడు పలికిన హెచ్చరిక. చూసి రమ్మంటే కాల్చి వచ్చిన ఆయనకు.. అక్కడికక్కడ రావణుణ్ని కొట్టడం పెద్ద లెక్కకాదు! రావణ సంహారం తన స్వామి కార్యమని తలచాడు.

దుష్టశిక్షణ కోసం నారాయణుడు రాముడిగా అవతరించాడు. రామచంద్రుని అవతార ప్రయోజనాన్ని సిద్ధింపజేసే సంకల్పంతో రుద్రుడు.. ఆంజనేయుడిగా ఏతెంచాడు. వైశాఖ మాసం కృష్ణ పక్ష దశమి నాడు ఆంజనేయుడు జన్మించాడని పరాశర సంహిత చెబుతున్నది. శివుడి అష్టమూర్తుల్లో ఒకటైన వాయుదేవుడి అనుగ్రహం ద్వారా కేసరి అనే వానర వీరుని భార్య అంజనాదేవికి తపః ఫలితంగా రుద్రతేజంతో హనుమ జన్మించాడు. కిష్కింధకాండ మొదలుకొని యుద్ధకాండ ముగిసేవరకు రామకార్యంలో కృతకృత్యుడు అయ్యాడు హనుమ. సీతమ్మ ఎడబాటుకు గురైన రాముడిని ఊరడించాడు. సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. సీతమ్మ జాడ కనిపెట్టాడు. వివిధ సందర్భాల్లో హనుమ మొత్తం తొమ్మిది అవతారాలు ధరించారు. ఇవే హనుమన్నవావతారాలుగా ప్రసిద్ధి పొందాయి. పరాశర సంహితలో ఇందుకు సంబంధించిన విషయాలన్నీ విస్తారంగా ఉన్నాయి. ఈ తొమ్మిదిటిలో ప్రసన్నాంజనేయుడి అవతారం ఒకటి.

మహాభారతంలో అర్జునుడి జైత్రయాత్రకు జెండాపై కపిరాజుగా సహకరించిన రూపమే ప్రసన్నాంజనేయుడు. కాగా, గంగానదిలో మునిగిపోయే ప్రమాదంలో చిక్కుకున్న మైందుడనే బ్రాహ్మణుడిని కాపాడటానికి మారుతి ఎత్తిన అవతారమే వీరాంజనేయుడు. రామ ముద్రిక కోసం సాక్షాత్తూ బ్రహ్మదేవుడితో వివాదపడిన హనుమ… బ్రహ్మలోకాన్ని పెళ్లగించేస్తానని 20 చేతులలో 20 ఆయుధాలు ధరించి ‘వింశతి భుజాంజనేయ’ అవతారంలో విశ్వరూపం చూపించాడు. శతకంఠ రావణుడి సంహారం కోసం సీతమ్మవారికి అండగా పోరాడుతూ ఆంజనేయుడు ‘పంచముఖ’ అవతారం దాల్చాడు.

దుర్వాస మహాముని తపస్సుకు సంతుష్టుడై పద్దెనిమిది భుజాలతో ప్రత్యక్షమైన రూపం అష్టాదశ భుజ ఆంజనేయ అవతారం. ఇక కుండిన నగరంలో ధ్వజదత్తుడనే వేదవేదాంగవేత్తకు పేదరికాన్ని పోగొట్టిన రూపం ‘సువర్చలాంజనేయ’ అవతారం. కపిలుడనే పండితుడిని అనుగ్రహించడానికి ‘చతుర్భుజ ఆంజనేయ’ అవతారం ధరించాడు. ఈ అవతారంలో హనుమంతుడి పక్కన సువర్చలా దేవి ఉండటం ప్రత్యేకం. మరో అవతారం ‘ద్వాత్రింశత్‌ భుజ ఆంజనేయుడు’. ఇందులో ముప్పై రెండు భుజాలతో మాహిష్మతి పాలకుడు సోమదత్తుడిని రక్షించాడు. ఇక గాలుడనే బోయను కరుణించడానికి ‘వానరాకార ఆంజనేయ’ అవతారాన్ని ధరించాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles